ఆపరేషన్ సింధూర్: పాక్‌కు సాయం చేశామని తొలిసారి ఒప్పుకున్న చైనా

  • గతేడాది భారత్‌తో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌కు సాయం చేశామన్న చైనా
  • ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ఎయిర్‌బేస్‌లో తమ ఇంజనీర్లు ఉన్నట్లు వెల్లడి
  • ఫైటర్ జెట్లకు చైనా సాంకేతిక సాయం అందించినట్లు స్పష్టత
  • ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం నాడు చైనా ప్రభుత్వ మీడియాలో కథనాలు
గతేడాది మే నెలలో భారత్‌తో జరిగిన 'ఆపరేషన్ సింధూర్' సైనిక ఘర్షణ సమయంలో తాము పాకిస్థాన్‌కు ప్రత్యక్షంగా సాయం అందించామని చైనా తొలిసారి బహిరంగంగా అంగీకరించింది. పాకిస్థాన్ వైమానిక దళానికి (PAF) చెందిన చైనా ఫైటర్ జెట్ల పనితీరును పర్యవేక్షించేందుకు తమ ఇంజనీర్లు పాక్‌లోని ఎయిర్‌బేస్‌లో ఉన్నారని వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీలో ప్రసారమైన కథనాలతో ఈ సంచలన నిజం బయటపడింది. దీనిపై హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది.

2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పౌరుల మృతికి కారణమైన ఉగ్రదాడికి ప్రతీకారంగా, 2025 మే 7న భారత్ 'ఆపరేషన్ సింధూర్' ప్రారంభించింది. ఈ నాలుగు రోజుల ఘర్షణ సమయంలో, చైనాకు చెందిన ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ (AVIC) ఇంజనీర్లు జాంగ్ హెంగ్, జు డా పాక్‌లోని ఎయిర్‌బేస్‌లో ఉండి అక్కడి వైమానిక దళానికి సాంకేతిక సహకారం అందించారు. "ఎయిర్ బేస్‌లో యుద్ధ విమానాల గర్జనలు, హెచ్చరిక సైరన్ల మోత మధ్య, 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో పనిచేశాం" అని ఇంజనీర్ జాంగ్ హెంగ్ సీసీటీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఈ ఘర్షణ సమయంలో పాక్‌కు చైనా శాటిలైట్ ఇంటెలిజెన్స్ కూడా అందించిందని భారత సైన్యం గతంలోనే ఆరోపించింది. ఇప్పుడు చైనా ప్రభుత్వ మీడియానే స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించడం, భారత్-చైనా-పాకిస్థాన్ సంబంధాలలో కీలక పరిణామంగా మారింది. ఆపరేషన్ సింధూర్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు, 13 పాకిస్థానీ విమానాలను ధ్వంసం చేశామని భారత సైన్యం ప్రకటించిన విషయం తెలిసిందే.
 

Operation Sindhoor
China
Pakistan
India
PAF
Aviation Industry Corporation
Zhang Heng
Fighter Jets
Military Conflict
Satellite Intelligence

More Telugu News